యువతిని వివస్త్ర చేసిన కేసులో ఐదుగురి అరెస్ట్

February 04, 2016 | 12:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
tanzanian-girl-stripped-5-arrested-niharonline

బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి, భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

21 ఏళ్ల విద్యార్తిని ఓ గుంపు దుస్తులిప్పేసి, ఆమెను చిత్తగ్గొట్టింది. ఈ దురదృష్టకరమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆచార్య కాలేజ్ బీబీఏ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థిని తన సహచరులతో కలిసి కారులో బయటికి వెళ్లింది. హెసరుఘట్ట సమీపంలో కారు అదుపుతప్పి ఓ మహిళను డీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ సుందరేషన్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక అక్కడికి చేరుకున్న స్థానికులు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. టాంజానియా యువతిని బట్టలు చింపి రోడ్డు మీద పడేసి కొట్టడం ప్రారంభించారు. నగ్నంగా యువతికి సాయం చేద్దామని తన టీ షర్టు ఇవ్వబోతున్న ఓ యువకుడిని కూడా చితకబాదారు. విషయం తెలుసుకుని ఆమెకు సాయం చేద్దామని వచ్చిన ఆమె స్నేహితులను కారులోంచి లాగి, దానిని తగలబెట్టారు. నిస్సహా స్థితిలో ఉన్న ఆ విద్యార్థిని అటుగా వెళ్తున్న ఓ బస్సు ఎక్కేందుకు యత్నించగా, తోటి ప్రయాణికులు ఆమెను కిందకి నెట్టివేశారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ ను పిలుచుకుని వస్తే కేసు నమోదు చేస్తామని చెప్పటంతో వారు అవాక్కయ్యారు. ఆల్ ఆఫ్రిక్ స్టూడెంట్స్ ఇన్ బెంగళూరు సంస్థ సహకారంతో బాధితులు బెంగళూరులోని ఆఫ్రికా రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఈ ఘటనపై టాంజానియా హైకమిషనర్ జాన్ కిజాజి బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా... కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ స్పందించారు. ఘటన ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ట్విట్టర్ లో తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించాల్సిందిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక ప్రభుత్వాన్ని కొరినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ