అయ్యయో కాంగ్రెస్ పార్టీ నుంచి కాదండీ... మంత్రిగా ఉన్న సమయంలో కేటాయించిన అధికారిక నివాసం నుంచి లెండి. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తనకు కేటాయించిన బంగ్లాను వీలైనంత తొందరగా ఖాళీ చేయాలని రాజ్యసభ సభ్యుడు, నటుడు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం నోటీసు పంపింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన చిరుకు అక్బర్ రోడ్ లో అధికారిక నివాసాన్ని కేటాయించారు. దీనిని ఖాళీ చేయాల్సిందిగా జూన్ లోనే ఆయనకు నోటీసు పంపినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈసారి మరో నోటీసును పంపించారు. వీలైనంత త్వరగా మీరు ఈ నివాసాన్ని ఖాళీచేయాలి లేకుంటే బలవంతంగా ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసును గేట్ ద్వారానికి అంటించి ఉంది. చిరుతోపాటు రాజ్యసభ సభ్యులైన జైరాం రమేష్, ఏకే ఆంటోనీలకు కూడా నివాసాలను ఖాళీచేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది.