పశ్చిమ బెంగాల్ లో జరగాల్సిన అమ్మాయిల ఫుట్ బాల్ మ్యాచ్ ను దుస్తులు బిగుతుగా ఉన్నాయని కాన్సిల్ చేశారట. ఈ గేమ్ ఔట్‑డోర్ లో జరగాల్సి ఉండగా అమ్మాయిలు బిగుతైన దుస్తులు వేసుకుంటే ప్రేక్షకులను రెచ్చగొట్టినట్టవుతుందని నిర్వాహకులు మ్యాచ్ ను రద్దు చేసినట్టు తెలిపారు. మల్దా జిల్లాలోని చండీపూర్ లోని స్థానిక క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు భాగంగా కోల్ కతా, ఉత్తర బెంగాల్ మహిళా ఫుట్ బాల్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజున దీన్ని కాన్సిల్ చేశారు. రెండు రోజులకు ముందుగా జరగాల్సిన ఉన్న ఈ పోటీని నిలిపివేయడంపై కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. నిర్వాహకుల తీరు సరి అయినది కాదని, వాళ్లని అలాగే వదిలేస్తే సానియా మీర్జాను కూడా ప్యాంటు వేసుకుని టెన్నిస్ ఆడమని డిమాండ్ చేసినా చేయవచ్చునని భారత ఫుట్ బాల్ టీమ్ కు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రీడాకారుడొకరు అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయమై నిరసన తెలుపగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం రద్దును సమర్థించారు. మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందునే మ్యాచ్ నిలిచిపోయిందని బ్లాక్ డెవలప్ మెట్ అధికారులు చెప్పారు. కొందరు వ్యక్తులు మతపరమైన హెచ్చరికలు చేయడం వల్లే మ్యాచ్ ను రద్దుచేసినట్లు ప్రధాన నిర్వాహకుడు రేజా రజీర్ పేర్కొన్నారు.