ప్రముఖ సాప్ట్ వేర్ సంస్థ ఐబీఎం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధంచేసినట్లు సమాచారం. ఇండియాలోని వివిధ నగరాల్లో పనిచేస్తున్న సుమారు 5వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పెరుగుతున్న మార్జిన్ ఒత్తిళ్లను తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల పనితీరు ప్రాతిపదికన తొలగింపు జాబితా తయారవుతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,98,455 మంది ఉద్యోగులు ఐబీఎంలో పనిచేస్తున్నారు. భారత్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని విభాగాల్లో ఈ తొలగింపులు ఉండవచ్చునని సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా, ఐబీఎం ప్రతినిధి ఒకరు ఉద్యోగుల తొలగింపు వార్తలను కొట్టిపారేశారు. కంపెనీ ఖర్చులను తగ్గించి ఉత్పత్తులను పెంచేందుకు ప్రణాళికలు మాత్రం చేస్తున్నామని ఆయన వివరించారు.