కొత్త సంవత్సరం మొదట్లోనే ప్రధాని నరేంద్రమోదీకి పెద్ద సవాలే వచ్చి పడింది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులు కలకలం రేపారు. అయితే ఉగ్రవాదులు విరుచుకుపడనున్నారన్న హెచ్చరికలతో అప్పటికే అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు దాడిని తిప్పికొట్టాయి. ఎయిర్ బేస్ లోకి దూసుకెళ్లిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ క్రమంలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వేగంగా స్పందించారు.
శనివారం సాయంత్రం తన కేబినెట్ లోని ముఖ్యులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం. దాడికి సంబంధించి సమగ్ర వివరాలను ఈ సమావేశం మందు పెట్టే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారుకు అప్పగించారు. దీంతో నేటి ఉదయమే రంగంలోకి దిగిన ఆయన దాడికి సంబంధించి సమగ్ర వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ప్రతిపక్షాలు మాత్రం ఓవైపు పాక్ తో చర్చలంటున్న మోదీ ఈ దాడులను ఖండించకుండా ఉండగలరా అంటూ ప్రశ్నిస్తున్నాయి.