విశాఖ తీరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ ట్యాంకులు దూసుకువస్తున్నాయి.విమానాలు వదలకుండా రొద చేస్తున్నాయి. బాంబులతో బీచ్ దద్దరిల్లిపోతోంది. దాడులను ఎదుర్కొనేందుకు నేవీ దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ వార్ సీన్ ఇప్పుడు విశాఖ తీరంలో కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లో ఈ సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 4 న ప్రారంభమైన ఈ విన్యాసాలు 8 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సాగర తీరంలో నేవీ దళాలు నిర్వహించే సన్నివేశాలను వీక్షించేందుకు యువత పెద్ద ఎత్తున హాజరవుతుంది.
ఇక ఈ అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష వేడుకలకు ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారు. ఈ మేరకు రాత్రికి వారిద్దరూ విశాఖ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ విశాఖకు వెళ్లనున్నట్లు సమాచారం.
నౌకాదళ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానితో పాటు గవర్నర్ కూడా పాల్గొంటారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ప్రధాని గౌరవ అతిథిగా హాజరవుతారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్ లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11వేల నేవీ ప్రతినిధులు హాజరవుతున్నారు.