చైనా, మంగోలియా దేశాల పర్యటనలను విజయవంతంగా ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం దక్షిణ కొరియా చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. అనంతరం సియోల్ లో ఏర్పాటుచేసిన ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘మీతో మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భారత్ లో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. భారత్ యాక్టివ్ గా లేకపోవటంతో బ్రిక్స్ కూటమి అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతోందనే అపవాదు గతంలో ఉండేదని, ప్రస్తుతం భారత్ బలోపేతమయిందని, భారత్ లేని బ్రిక్స్ అసంపూర్తిగా ఉందని, కనీసం దాన్ని ఊహించుకోలేమని చెప్పారు. సార్క్ ను బలోపేతం చేయటానికి భారత్ కృషి చేస్తోందని మోదీ చెప్పారు. దేశ పునర్నిర్మాణంలో కొరియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ప్రసంగానికి ఎన్నారైల నుంచి మంచి స్పందన లభించింది.