పాలన వ్యవహారంలోనే కాదు, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి పై ఆంధ్రా మంత్రులు రోజుకోకరు మండిపడుతున్నారు. తాజాగా పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని పార్ట్-2, సెక్షన్-8 చెల్లదని కేసీఆర్ అనటం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెక్షన్-8 చెల్లదని అన్నప్పుడు, రాష్ట్ర విభజన కూడా చెల్లదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పుతున్నారు. ఆ చట్టం చెల్లదనిగానీ, అందులో నిబంధనలు చెల్లవని చెప్పటానికి ఆయనేవరని(కేసీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చట్టాన్ని తయారు చేసిన రాజీవ్ శర్మ తదితర అధికారులను కేసీఆర్ ఇప్పుడు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారని, కానీ, వాటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆక్షేపించారు. పనిలోపనిగా ఆయన సెక్షన్-8 లోని నిబంధనలు చదివి వినిపించారు. తెలంగాణ అవతరించిన తర్వాత పాలనాపరమైన అవసరాల కోసం, ఇక్కడి ప్రజల శాంతిభద్రతల కోసం పూర్తి హక్కులు గవర్నర్ వేనని, వీటి విషయంలో తెలంగాణ మంత్రలతో చర్చించిన తర్వాత అవసరమనుకుంటే వ్యక్తిగత నిర్ణయం తీసుకునే హక్కు కూడా గవర్నర్ కి ఉంటుందని ఉమా తెలిపారు. కానీ, ప్రస్తుతం గవర్నర్ వ్యవహారం పట్టింపు లేనట్టుగా ఉన్నట్లుందని, ఈ వ్యవహారంలో గవర్నర్ విచక్షణ అధికారాలను కేసీఆర్ అణిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. బిల్లు పాస్ కావటానికి మాత్రమే సెక్షన్-8 చేర్చారే తప్ప, అమలు చేసేందుకు కాదని ఆయన అన్నారు. మొత్తం విభజన చట్టాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ వ్యవహారిస్తున్నారని ఉమా విమర్శించారు.