తాము చేసే దిక్కుమాలిన పనులకు రాజకీయ నేతలు సంజాయిషీ ఇచ్చే విధానాలను చూసుకుంటున్నప్పుడల్లా జనాల్లో జుగుప్స కలగటం కామన్. అయితే కామన్ మ్యాన్ పార్టీ అంటూ వచ్చి ఆప్ ఎమ్మెల్యేలు తమ చర్యలతో దేశ వ్యాప్తంగా సంచలనం రేపారు. జనాల సొమ్మును అప్పణ్ణంగా జేబులో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వేతనాలను ఒకేసారి నాలుగు రెట్లు పెంచేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఈ మేరకు ప్రతిపాదిత బిల్లును ఢిల్లీ అసెంబ్లీ నిన్న పాస్ చేసేసింది. దీంతో నిన్నటిదాకా నెలకు రూ.88 వేల వేతనం అందుకుంటున్న ఢిల్లీ ఎమ్మెల్యేలు ఇకపై నెలకు రూ.2.10 లక్షల వేతనాన్ని అందుకోనున్నారు. ఇందులో బేసిక్ వేతనాన్ని నాలుగు రెట్లు పెంచుకుంటూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసుకున్నారు. దీనిపై వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికీ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పలు మీడియా సంస్థల ప్రతినిధుల వేతనంలో తమ వేతనం 120వ వంతు కూడా లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ఉచిత సలహా పడేశారు. ప్రధాని వేతనాన్ని కూడా భారీగా పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. కీలక పదవిలో ఉన్న ప్రధాని వేతనం ఎంత లేదన్నా, నెలకు రూ.8 నుంచి 10 లక్షల మధ్య ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయినా, అమెరికా అధ్యక్షుడు మీ వేతనం ఎంత? అని ప్రధాని మోదీని అడిగితే ఏం చెప్పుకుంటారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. తమకు లాభం చేకూరే పనిని చేసుకుని ప్రధానిని మధ్యలో లాగటం ఏమిటో? ఇంతకీ మోదీ ప్రధానిగా అందుకునే జీతం ఎంతో తెలుసా? 1,60,000 రూ. అంటే ఇకపై ఆప్ ఎమ్మెల్యేలకన్నా తక్కువే.