తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కాస్త లౌక్యం, దౌత్యం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావే. పార్టీ స్థాపించిన సమయం నుంచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున్న తీసుకెళ్లటంలో ఈయన గారి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నేతగా కంటే ప్రజల మనిషిగా ఆయనకు పాపులారిటీ ఎక్కువ. అందుకే మేనమామ కేసీఆర్ తోసహా రాష్ట్రంలో ఎవరికీ దక్కని రికార్డు మెజార్టీతో సిద్ధిపేట ప్రజలు ఆయన్ను అసెంబ్లీకి పంపుతున్నారు. ఇక కేసీఆర్ కూడా తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎప్పటికప్పుడూ ప్రతీ అంశంలో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. అందుకే తన తనయుడు కేటీఆర్ కన్నా హరీష్ నే ఎక్కువ నమ్మి బాధ్యతలు అప్పజెప్పుతారు టీసీఎం కేసీఆర్. వరంగల్ ఎన్నికల విజయమే ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. అలాంటి హరీష్ రావు స్వరాష్ట్రం కోసం మరో విషయంలో గెలుపు సాధించి చూపారు.
ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న లోయర్ పెన్ గంగ ప్రాజెక్ట్ కు అవాంతరాలను తొలగించేందుకు కృషి చేసి ఆయన సక్సెస్ అయ్యారు. మంగళవారం ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో హరీష్ జరిపిన చర్చలు ఫలించాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్టును నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ముంబై అక్కడి సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో భేటీ అయిన హరీష్ రావు ప్రాజెక్టు వల్ల ఉన్న ప్రయోజనాలు, తెలంగాణకు ఒనగూరే లాభాలను చర్చించారు.
ఇక ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు నష్టం జరుగుతుందన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని హరీశ్ రావు కూలంకషంగా వివరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఒప్పందం చేసుకోనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. దీంతో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న లోయర్ పెన్ గంగ ప్రాజెక్టుకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి.