ఊహించని రీతిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది డీఎంకే. సర్వేలు సైతం షాకేయ్యేలా తమిళ తంబీలు ఆ పార్టీకి షాకిచ్చి తిరిగి అమ్మకే పగ్గాలు అప్పజెప్పారు. ఇదిలా ఉంటే డీఎంకే అధినేత కరుణానిధి మాత్రం తాను పోటీ చేసిన తిరువారూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. అంతేకాదు, ఈ క్రమంలో ఆయన మరో రికార్డు కూడా సాధించారు. వరుసగా 13 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి, అన్నింటా విజయం సాధించిన ఏకైక భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించారు. దేశంలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి ఆయన తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ, మరో ఐదేళ్ల అవకాశాన్ని ఈ ఎన్నికల ద్వారా అందుకున్నారన్నమాట. పోటీ చేసిన అన్ని శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కరుణానిధి, అపజయమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతున్నారు. అంతేకాదు రాజకీయ ఆరంగ్రేటం నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని వ్యక్తిగా కరుణానిధి రికార్డు సృష్టించారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఓడిపోని వ్యక్తిగా ఘనత ఆయనకు దక్కింది.