శుభకార్యాల వంకతో, దూరమైన ఆత్మీయత వికసింపచేసుకోవడం ప్రాప్తకాలజ్ఞుల లక్షణం. పిలిస్తే నేరావడం ఒక పద్ధతి అవగా, పిలవక పోయినా దొడ్డ మనసుతో హాజరై ఆశ్చర్య చకితులను చేసి ‘ఏం బావగారూ పిలవకపోయినా వచ్చాను చూశావా?’ అని ఎస్.వి.రంగారావులు, గుమ్మడ్లు ఉండేవారు. వాతావరణం తేలిక పడి ఆహ్లాదకరంగా మారి సంబంధ బాంధవ్యాలు గట్టిపడి తీగ సాగేవి. అమరావతి శంఖుస్థాపన ఓ చారిత్రక ఘట్టం. తెలుగోడి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే అపురూప సందర్భం. నన్ను పిలవొద్దు మహా ప్రభో అని మొత్తుకుంటున్న ప్రబుద్ధులు దానికి సమర్ధనగా పలు కారణాలు, సాకులు చూపి, అక్కడి రైతులకు అన్యాయం జరిగిపోయిందని భారీ రొక్కం ఫలానా వాళ్ళ జేబుల్లోకి ప్రవహించిందని మల్లె పువ్వు కబుర్లతో స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని బహిష్కరించి చతికిలబడి రొప్పుతున్నారు. దీనికి కొంచెం మసాలా తగిలించి ఇదంతా వృధా, దుబారా అనిన్నీ... ఫలానా ప్రాంతపు ప్రజల మనోభావాలు నిర్లక్ష్యం చేస్తున్నారని రాయల సీమకే చెందిన చంద్రుణ్ణి నిందించడం జరుగుతోంది. హమ్మయ్య ఈ చంద్రుడు ఆ చంద్రుడు వాకిట్లోకెళ్ళి బొట్టుపెట్టి పిలిచాడు రొంబ సంతోషం అని సామాన్య జనం సంతృప్తిగా నిట్టూరుస్తుంటే వక్రబుద్ధితో రంధ్రాన్వేషణ చేస్తూ, ఆ... ఇదెన్నాళ్ళ భాగోతం లే.. అని చప్పరించే నక్షత్రకులు కొంతమంది! ఎమ్మెల్సీ గేయానందుడు రాయలసీమకు అన్యాయం జరిగిపోతుందని మనోభావాలు గాయపడి పోయాయని, ప్రత్యేక ప్యాకేజీగా తమ ప్రాంతానికి లక్ష్య కోట్లు కేటాయించాలని తీవ్రంగా తీండ్రించారు, చంద్రబాబు కూడా ఆప్రాంతీయుడే అన్నది మర్చిపోయి.