తెలంగాణ రాష్ట్ర సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు టీ కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి ప్రచార కార్యకర్తగానా? కొంపదీసి సీఎల్పీ పదవికి కుందూరు జానారెడ్డి రాజీనామా చేయబోతున్నారా? కేసీఆర్ ఆయనకు ఏమైనా ఎరవేషారా?. ఎంత మాత్రం కాదులేండి. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ మొన్న వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల పేర్లను ప్రస్తావిస్తూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో జానారెడ్డి బుధవారం ఓ ఆసక్తికర కామెంట్ చేశారు.
ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు మూడేళ్లలో రెండు పంటలకు నీరందిస్తానని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి ప్రస్తావించారు. మూడేళ్లు కాదు కదా, ఐదేళ్లలో అయినా కేసీఆర్ తన మాట నిలుపుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లలో తన హామీ అమలు సాధ్యమేనని కేసీఆర్ అంతర్జాతీయ స్థాయి ఇంజినీరింగ్ నిపుణులతో చెప్పిస్తే, తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని జానారెడ్డి ప్రకటించారు.
అయితే అంతటితో ఆగక కేసీఆర్ కు తాను ప్రచార కార్యకర్తగా పనిచేస్తానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని చెప్పే క్రమంలో జానారెడ్డి ఈ వ్యాఖ్య చేశారు. నా త్యాగాలనే తప్పుపడతావా?...ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి అయ్యేవాడిని. కానీ తెలంగాణ కోసం ఆ పదవినే వదిలేశా. అలాంటి నాపైనే నోరు పారేసుకుంటావా’’ అంటూ విరుచుకుపడ్డారు. ఇక జానా నోటి వెంట ‘ప్రచార కార్యకర్త’ పదం విన్న అక్కడి మీడియా ప్రతినిధులతోపాటు కార్యకర్తలు కూడా విస్తుపోయారుట. చూస్తుంటే జానారెడ్డి కేసీఆర్ కి పెద్దసవాలే విసిరినట్లున్నాడు కదా!