అన్నాడీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఎట్టకేలకు పెద్ద ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా తేలుస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో గతంలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేసింది. జయపై మోపబడిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో అమ్మ అభిమానుల్లో ఆనందోత్సహాలు నెలకొన్నాయి. తమిళనాట అంతా పండగ వాతావరణం నెలకొంది. ఇక తీర్పు పై ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తీర్పు ప్రతిని అధ్యయనం చేయాల్సి ఉందని పేర్నొన్నారు. ఆయన వేసిన పిటిషన్ ఆధారంగానే దాదాపు 18 ఏళ్లుగా ఈ కేసులో విచారణ జరుగుతుంది. కాగా, గతేడాది బెంగళూర్ ప్రత్యేక కోర్టు జయను దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె జైలుకు వెళ్లటంతోపాటు అనర్హత వేటు పై కూడా పడి పదవీచ్యుతురాలు కావాల్సి వచ్చింది. ఇక ఈ తీర్పుతో జయ మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.