నేషనలిస్ట్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కూతురు, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నాసిక్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎంపీలుగా తాము పార్లమెంటులో దేశాన్ని ఉద్ధరించే చర్చలేవీ చేయమని... కేవలం చీరలు, ఫేసియల్స్ పైనే మాట్లాడుకుంటామని ఆమె వ్యాఖ్యానించారు. ఓ వైపు కీలక అంశాలపై సీరియస్ గా చర్చ జరుగుతున్నా, తాము మాత్రం చీరలపైనే ముచ్చట్లాడుకుంటామని కూడా ఆమె అన్నారు. అంతేకాక పురుష ఎంపీలు చీరలపై చర్చలేంటని తమపై కామెంట్లు విసురుతున్నా కూడా వాటిని పట్టించుకోమని ఆమె పేర్కొన్నారు. పట్టించుకోకపోవడమే కాక తమపై కామెంట్లు సంధించే పురుష ఎంపీలకు తమదైన శైలిలో ఎదురు దాడి చేస్తామని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
ఇప్పటికే కోట్లాది రూపాయల సొమ్ము వెచ్చించి నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాల్లో దేశ సమస్యలపై చర్చ జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సుప్రియా సూలే చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతదూరం వెళతాయో చూడాలి. కొసమెరుపేమిటంటే, భవిష్యత్తులో మీరు కూడా రాజకీయాల్లోకి వస్తే, మాలాగా ముచ్చట్లాడుకోవద్దని ఆమె విద్యార్థులకు పిలుపునివ్వటం.