నేతలు నోరు జారటం కామనే. అవి వ్యక్తిగతమైనవి అయితే ఫర్వాలేదు. మనోభావాలు దెబ్బతీసేవిలా ఉంటే కాస్త తీవ్రత ఉన్నప్పటికీ ఎలాగోలా తగ్గించవచ్చు. కానీ, ఓ నగరానికి ప్రథమ పౌరుడు పొజిషన్ లో ఉండి, ఆపైన దేశాధ్యక్ష పదవికి పోటీపడుతూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అతనే దావావో నగరం మేయర్ రోడ్రిగో డుటిర్టీ. బహుశా నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ ఈయన ముందు దిగదుడుపే అనిపించకమానదు ఆయనగారు చేసిన వ్యాఖ్యలు వింటే.
ఇంతకీ విషయమేంటంటే... రోడ్రిగో తొలిసారిగా 1989లో దావావో నగరానికి మేయర్ గా పనిచేశారు. ఆ సమయంలో దావావో సిటీ జైలులో హింసాకాండ చెలరేగింది. ఖైదీలు జాక్వలిన్ హమిల్ అనే ఆస్ట్రేలియన్ యువతి సహా మరో 15 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సైన్యం జైల్లోకి దూసుకొస్తున్న సమయంలో ఆమెను గొంతు కోసి చంపారు. ఈ దారుణంపై రోడ్రిగో క్విజోన్ లో జరిగిన ప్రచార ర్యాలీలో స్పందించాడు.
"ఆమెపై అత్యాచారం జరిగినందుకు నాకు కోపంగా ఉంది. ఇదో విషయం. అయితే, ఆమె చాలా అందంగా ఉంది. నగరానికి తొలి పౌరుడినైన నేను ముందు ఉండాల్సింది. వేస్ట్ అయిపోయింది" అంటూ వీడియో కెమెరా ముందు మాట్లాడారు. "ఆమె ముఖంలోకి నేను చూశాను. అందమైన అమెరికన్ హీరోయిన్ లా కనిపించింది. నేనూ ఉండాల్సింది. వృథా అయిపోయింది" అని రోడ్రిగో వ్యాఖ్యానించాడు. ఇంకేముంది, ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ కాగా, సాధారణ ప్రజల నుంచి విపక్షాలు, మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి.
మరోవైపు ఆస్ట్రేలియన్ ఎంబసీ సైతం కూడా ఈ మాటలపై మండిపడింది. అత్యాచారాలు, హత్యలపై జోకులేంటని ప్రశ్నిస్తూ, మహిళలు, బాలికలపై ఎటువంటి హింసనూ ఎక్కడైనా, ఎప్పుడైనా వ్యతిరేకించాల్సిందేనని అభిప్రాయపడింది. ఇటువంటి వ్యక్తులకు అధికారం ఇవ్వరాదని రోడ్రిగో ప్రధాన పోటీదారుగా ఉన్న రోక్సాస్ ప్రజలను కోరారు. బహుశా ఇంతకన్నా క్రూరమైన వ్యాఖ్యలు బహుశా ఇంకెవరూ చెయ్యలేదేమో కదా!