టీడీపీ ఎంపీ రాజీనామా అంటూ టెన్షన్ పెట్టాడు

October 28, 2015 | 11:31 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Rayapati-sambasiva-rao-threatens-to-quit-TDP

ఓవైపు ప్రతిపక్ష వైసీపీ నుంచి అధికార పక్షం టీడీపీలోకి వలసలు కొనసాగుతుంటే మరోవైపు ఓ టీడీపీ ఎంపీ రాజీనామా అంటూ కాస్త టెన్షన్ పెడుతున్నారు. నేతల మధ్య మనస్పర్థలు లేకుండా పార్టీని కొనసాగిస్తున్న అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు. తన నియోజక వర్గంలో నీటి సమస్యలపై ఎప్పటి నుంచో తాను అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. ఇదొక్కటే కాదు తాను ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారంపై అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తర్వాత నుంచి ఇదే పరిస్థితి నెలకొందని, ఇకపైనా ఇలాగే జరిగితే తన ఎంపీ పదవికి రాజీనామా చేసేస్తానని ఆయన హెచ్చరించారు.

ఇంతకీ అసలు విషయమేంటంటే... మంగళవారం గుంటూరులో వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన రాయపాటి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సహా వివిధ శాఖల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని రాయపాటి వాపోయారు. తన నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య ఇబ్బంది పెడుతోందని, అధికారులు స్పందించని కారణంగా తాను తన సొంత డబ్బుతో ట్యాంకర్లను ఏర్పాటు చేయించానని ఆయన మంత్రికి తెలిపారు.

అధికారుల తీరులో మార్పు రాకుంటే తాను రాజీనామా చేస్తానని రాయపాటి సమావేశం పోడియం వద్దకు వచ్చి మరీ నిరసన గళం విప్పారు. రాయపాటికి సర్దిచెప్పిన ప్రత్తిపాటి అక్కడికక్కడే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, ఎంపీ పేర్కొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి జోక్యంతో కాస్త తగ్గినప్పటికీ చాలా మంది సీనియర్లలో ఇదే అభిప్రాయం నెలకొంది. ఇది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కలగజేసుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ