ధూమపానంతో కేన్సర్ రావటం ఖాయమేనని ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలన్నీ మొత్తుకుంటుంటే అబ్బే... అలాంటిదేమీ లేదంటున్నారు ఓ ఎంపీగారు ఈ తరహా ముప్పు పొంచి ఉందని భారత్ లో ఏ పరిశోధన తేల్చలేదని బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొగాకు ఉత్పత్తులన్నింటిపై హెచ్చరిక చిహ్నాలు 85 శాతం మేర ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు నేటి నుంచి (ఏప్రిల్ 1 నుంచి) అమల్లోకి రానున్న నేపథ్యంలో గాంధీ మంగళవారం చేసిన ప్రకటన మోదీ సర్కార్ ను ఇరకాటంలో నెట్టింది. పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 పై వేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న గాంధీ ఈ వ్యాఖ్య చేయటం గమనార్హం. పొగాకుతో కేన్సర్ వస్తుందని భారత్ లో ఏ పరిశోధనా తేల్చలేదు. ధూమపానంతో కేన్సర్ ముప్పు పొంచి ఉందని చెప్పిన పరిశోధనలన్నీ విదేశాల్లో జరిగినవే. ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీడీ తయారీపై ఆధారపడి 4 కోట్ల మంది పనిచేస్తున్నారు అని దిలీప్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం ప్రారంభమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ తోపాటు మిగతా పక్షాలు కూడా ఏకిపడేస్తున్నాయి. ఆఖరికి సొంత పక్షం అయిన బీజేపీ కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఆ పార్టీ ముఖ్యనేత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... దిలీప్ గాంధీ అలా మాట్లాడాల్సి ఉందికాదని చెప్పారు.