తమిళనాట అమ్మగా ఆరాధనలు అందుకుంటున్న జయలలితకు త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వింత పోటీ ఎదురు కానుంది. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి తన పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను వెల్లడించిన అన్నాడీఎంకే అధినేత్రి తాను మాత్రం చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించేసింది. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి బయటికి వచ్చి తర్వాత ఆమె ఈ నియోజకవర్గం నుంచే ఘన విజయం సాధించారు. ఆ టైంలో కూడా ఆమెపై పోటీకి అభ్యర్థులను నిలిపేందుకు ప్రధాన పార్టీలన్నీ భయపడ్దాయి.
అలాంటిది ఈ ఎన్నికల్లో మాత్రం ఆమెకు పోటీ తప్పటం లేదు. జయపై పోటీ చేసేందుకు ఓ హిజ్రా సన్నద్ధమయ్యారు. సేలం జిల్లా మగుదంచావడికి చెందిన 33 ఏళ్ల దేవి అనే హిజ్రా ప్రస్తుతం ఆర్కే నగర్ కేంద్రంగా పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటర్ దాకా చదువుకున్న దేవి ప్రస్తుతం ఓ 200 మంది పేద విద్యార్థులకు చదువు కూడా చెప్పిస్తున్నారు. అంతేకాదు 60 మంది వృద్ధులు, అనాథల బాగోగులనూ ఆమె భుజానికెత్తుకున్నారు. తమిళ సినీ దర్శకుడు సీమన్ కు చెందిన ‘నామ్ తమిళార్ కచ్చి(ఎన్టీకే)’ పార్టీ తరఫున బరిలోకి దిగనున్న దేవి జయకు గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.
అంతేకాదు పార్టీ టికెట్ ఖరారైన మరుక్షణమే దేవి జయపై ఆరోపణలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జయ అమలుచేయని కారణంగా అర్కే నగర్ నియోజకవర్గం సమస్యల నిలయంగా మారిందని, తనను గెలిపిస్తే ప్రజారోగ్యం, విద్యకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పేర్కొన్నారు.