ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు ను ఆంధ్రప్రదేశ్ శాసన ప్రతిపక్ష నేత జగన్మోహరెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిసిన విషయం తెలిసిందే. పైకి మర్యాదపూర్వకంగా కలిశానంటూ చెప్పుకున్నప్పటికీ దీనివెనక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో సరైన కాపు నేత లేకపోవడం, తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చన్న ఆలోచనతో ఉన్న జగన్ దాసరిని కలిసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కేంద్రంలో మంత్రిగా రాజకీయాల్లో చక్రం తిప్పిన దాసరి పార్టీలో ఉంటే బలపడొచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నాడు. ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఎన్డీఏ మిత్రపక్షాలకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ చూపు దాసరి మళ్లి ఉంటుందని అంటున్నారు.
ఈ క్రమంలో ఆయనకు రాజ్యసభ సీటును సైతం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో తమ పార్టీకి రాజ్యసభ సీటు దక్కనుందని, తమ పార్టీలో చేరితే, దాన్ని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని దాసరికి జగన్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇరుక్కుని ఉండటం, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయంగా బలహీనపడటంతో వైకాపాలో చేరేందుకు దాసరి కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కాస్తింత సమయం కొరినట్లు సమాచారం. నిన్న వారిద్దరి సమావేశం అనంతరం, దాసరి మీడియా ముందు జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని అన్నారు. వైఎస్ కుమారుడు అయిన జగన్ ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని కితాబిచ్చారు. జగన్ ఇప్పటికే మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని అతనికి తన దీవెనలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తునట్లు కూడా చెప్పారు. దీంతో దాసరి దాదాపు వైకాపాలో చేరుతారనే అర్థం చేసుకోవచ్చు.