కోడెలపై మళ్లీ అవిశ్వాసం అందుకా?

December 28, 2015 | 05:27 PM | 3 Views
ప్రింట్ కామెంట్
YSRCP-non-confidence-motion-second-time-against-kodela-niharonline

అధికారపక్షానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ వైకాపా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. కోడెల తీరు శోచనీయంగా ఉందని, ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకుని, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా చేసి, వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికారపక్షానికి అనుకూలంగా పనిచేయటం ఘోరమని వారి వాదన. ఈతీర్మానాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బృందం శాసనసభా కార్యదర్శికి అందజేసింది కూడా. ఆయనపై గతంలోనూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు ఆ పార్టీ చెబుతోంది. వ్యవహారశైలి మార్చుకుంటారని భావించి.. కొందరు పెద్దల సూచనతో అప్పట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకున్నాం. కానీ.. ఆయన తీరులో ఏమాత్రం మార్పు కన్పించడం లేదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు.

ఏకపక్షంగా వ్యవహరిస్తూ, విపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్న కోడెల వైఖరికి నిరసనగానే వైకాపా తరఫున అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఆయనలో మార్పును కోరుతూ మాత్రమే నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసులు ఇవ్వడం ద్వారా స్పీకర్ వ్యవహార శైలిపై సభలో చర్చకు అవకాశం ఉంటుందని, మా వాదన ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను కోడెల తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు తాకట్టు పెట్టారని జ్యోతుల నిప్పులు చెరిగారు. అవిశ్వాసం తరువాతైనా ఆయన శైలిలో మార్పు రావాలని కోరుకుంటున్నామని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ