సినిమాల్లో ఇంకా అవకాశం ఉన్నప్పటికీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల వైపు అడుగువేశాడు నందమూరి బాలకృష్ణ. అయితే రాజకీయాల్లో రాణించటం అంత సులువేం కాదని ఆటైంలో చాలా మంది సెటైర్లు వేశారు. పైగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నేతతో విబేధాలు రాకుండా ఉండలేడని చెప్పుకొచ్చారు. అయితే అడుగు పెట్టిన నాటి నుంచే బరిలోకి దిగి రాణిస్తున్నారాయన.
ఓవైపు సినిమాల సంగతి చూసుకుంటూనే రాజకీయాలను బాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ముందు వందో సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిసారిస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత మాట మార్చారు. సినిమాలు సినిమాలే, రాజకీయాలు రాజకీయాలే అని ప్రకటించారు. ఇంకోవైపు ఆయన వ్యవహార సరళిలోనే కాక మాట తీరులోనూ గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ స్లోగన్ తో ఆయన తండ్రి, దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావు తెదేపాను అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తొలి యత్నంలోనే తన తండ్రిని గెలిపించిన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే బాలయ్య కూడా విజయం సాధించారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా నియోజకవర్గ అభివృద్దిపై నిత్యం ఆలోచన చేస్తున్న బాలయ్య, మొన్న లేపాక్షి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన ఆయన అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. బాలయ్య నోట ఆయన తండ్రి మాట వినిపించేసరికి అక్కడున్న తోటినేతలతోసహా ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారంట. అయితే రాజకీయాల్లో ఇంత నీట్ గా మాట్లాడే బాలయ్య, సినిమాల పంక్షన్ల విషయానికొచ్చేసరికి బూతు పురాణం వదలకపోవటం కొసమెరుపు.