విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలోకి చేరాయి. విద్యుత్ పంపిణీ, విద్యుదుత్పత్తి, నీటి వాటాలు, ఉన్నత విద్యామండలి, బ్యాంకు ఖాతాల విషయంలో ఇలా రోజుకో విభాగంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిద్దాం రండి అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగగాణ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఈమేరకు విస్పష్ట ప్రకటన చేశారు. రాజకీయంగా విభేదించినా, ప్రభుత్వాలుగా ముందుకెళదామంటూ ఆయన చేసిన ప్రతిపాదన ఇరు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసింది. విభజన జరిగి ఏడాది కావస్తున్నా, 9,10 వ షెడ్యూల్ కేటగిరీ సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని, ఈ సంస్థల విభజన కోసం కలిసి కూర్చుని చర్చించుకుందామంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇరువురి మధ్య విభేదాలు వస్తే, ఇద్దరికీ నచ్చిన పెద్ద మనిషిని మధ్యవర్తిగా పెట్టుకుందామని ఆయన పేర్కొన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, కేంద్ర ప్రభుత్వం సహయం తీసుకుందామని చెప్పారు. మరి చంద్రబాబు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం గారి స్పందన ఎలా ఉంటుందో.