తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చర్మ రంగుపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధాని మౌనం వహిస్తున్నారన్నారు. గిరిరాజ్ తన వ్యాఖ్యలతో సోనియాను అవమానించారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం తరపున స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గిరిరాజ్ వ్యాఖ్యలను తమ ప్రభుత్వం సమర్థించడం లేదన్నారు. మహిళా నేతలపై వ్యాఖ్యలు సరికాదని, కానీ, ఈ విషయంలో అనవసరంగా ప్రధానిని లాగటం కూడా సరికాదని ముక్తాయించారు. దాంతో మరింత అసహనానికి లోనైన కాంగ్రెస్ నేతుల సభలో నినాదాలు చేయటం మొదలుపెట్టారు. అటు స్పీకర్ కూడా ప్రశ్నోత్తరాలు ప్రారంభించటంతో సభలో విపక్ష నేతల ఆందోళనతో గందరగోళం నెలకొంది.