సీనియర్ల పట్ల ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి మొదటి నుంచే సరిగ్గా ఉండదనే విమర్శలు ఉన్నాయి. తమకు ప్రాధాన్యం ఉంటుందని భావించిన వెళ్లిన సీనియర్లు అంతా ఒక్కోక్కరుగా పార్టీని వీడటం ఇందుకు నిదర్శనం. తమకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా కనీసం తమ సూచనలైనా పట్టించుకోవాలన్న వారి విన్నపాలను జగన్ ఎప్పుడో గాలికి వదిలేశారు. ఇలాంటి పరిస్థితిలో ఆయన తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు సంచనలంగా మారింది. ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైసీపీ యువ నేత, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ను జగన్ ఎంపిక చేశారు. దీంతో పార్టీ సీనియర్లు అంతా షాక్ తిన్నారు.
సాధారణంగా పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరే ముందే ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏర్పడిన ఖాళీని ఎవరితో పూడుస్తారా అని అంతా ఎదురుచూశారు. నిజానికి ఈ పదవిని సీనియర్లకు కట్టబెట్టడం ఆనవాయితీ. ఇందుకోసం రేసులో జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అమరనాథరెడ్డి వంటి వారు రెడీగా ఉన్నారు కూడా. అయితే వీరెవరినీ కాదని గడచిన ఎన్నికలకు కాస్తంత ముందుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ ఎంపిక చేయటంతో వారంతా విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు వారంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది.