అధికారంలో లేనప్పుడు చేదోడు-వాదోడుగా, వెన్నంటే ఉన్న నేతలంతా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. అంతేందుకు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డ బీజేపీ కూడా టీడీపీని లైట్ తీస్కుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు వారి వ్యతిరేకతకు కారణమేంటీ? ఇంకేంటీ అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోకపోవటమే. రాముడికి ఉడత సాయం మాదిరిగా చంద్రబాబు ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి రావటానికి పరోక్షంగా వారంతా సాయపడ్డారన్నది ఒప్పుకోవాల్సిందే. అయితే పాత మిత్రులను బాబు పట్టించుకోకపోవటం ఎంత నిజమో, వారి విమర్శలతో ఆయనకు వచ్చే పెద్ద నష్టమేమీ లేదన్నది కూడా అంతే నిజం.
తాజాగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చంద్రబాబుపై ఫైరయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో టీడీపీని గెలిపించింది, అంతకు ముందు తెలంగాణలో టీడీపీని నడిపించింది మాదిగలే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నాడు. అనుక్షణం టీడీపీ వెన్నంటి ఉన్న మాదిగలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపని మందకృష్ణ వ్యాఖ్యలను మరీ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల సూచన.