ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం ఏం చెయ్యట్లేదు. అందుకోసం ప్రతిపక్షంగా మేము పూనుకుంటాం అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దీక్షకు ఆయన దిగనున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అనుమతివ్వకపోవటం ఇప్పుడు రచ్చకు దారితీస్తుంది. దీనిపై అధికార నేతలంతా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం కావాలనే చేసిందని ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా జగన్ ఎన్ని రోజులు దీక్షలు చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని ప్రభుత్వం అంటోంది. రాజకీయ డ్రామాలు మానుకుని ప్రజల కోసం నిజంగా పోరాడాలని వారు సూచిస్తున్నారు. యూనివర్శిటీలు తిరిగి యువతను రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఇదే టైంలో ప్రభుత్వంలో పలు లోపాలు ఉండటం సహజమేనని ఒప్పుకుంటున్నారు కూడా.
టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి విపక్షం వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రతి చిన్న విషయంపై విమర్శలు గుప్పించడం మానుకోవాలని ఆమె ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. ఆయినా గుమ్మడికాయంత అభివృద్ధిలో ఆవగింజంత లోపాలు సహజమేనని ఆమె కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల అంశం ఆధారంగానే జగన్ గుంటూరు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారని నన్నపనేని అన్నారు. ప్రతిదానినీ విమర్శించే తీరును మార్చుకోవాలని ఆమె విపక్ష నేతలకు హితవు పలికారు. అదే టైంలో ప్రతి ప్రభుత్వంలోనూ లోపాలు తప్పవని ఆమె చెప్పుకొచ్చారు.