ప్రతిసారీ ఏదో ఒక సమస్యలతో సతమతమయ్యే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు పెద్ద చిక్కు వచ్చిపడింది. వెటరన్ క్రికెటర్ చందర్ పాల్ రిటైర్డ్ విషయం ఇప్పుడక్కడా పెద్ద చర్చ గా మారింది. విషయమేంటంటే... ఆస్ట్రేలియాతో త్వరలో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కు తనను ఎంపిక చేయకపోవటంపై వెటరన్ క్రికెటర్ చందర్ పాల్ ను ఆవేదన వ్యక్తం చేశాడు. తన కెరీర్ లో ఇదే చివరి సిరీస్ అవుతుందనుకున్నానని, కానీ, తుదిజట్టులో ఎంపిక చేకపోవటంపై నిరాశ కలిగిందన్నాడు. దీనిపై వెస్టిండీస్ దిగ్గజాలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. మాజీ స్టార్ ప్లేయర్ లారా దీనిపై స్పందిస్తూ... ఓ సీనియర్ ఆటగాడికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వటం లేదని, ఇన్నేళ్లు సేవలందించిన ఆటగాళ్ల అభిప్రాయాలను గౌరవించాలని ఆయన బోర్డుపై అసహనం వ్యక్తంచేశాడు. ఈ విషయంలో బీసీసీఐ చాలా హుందాగా వ్యవహరిస్తుందని, సచిన్ లాంటి సీనియర్ ప్లేయర్ లకు ఆ దేశ బోర్డు గౌరవంగా వీడ్కోలు పలికిందని ఆయన గుర్తుచేశారు. ఇదిలా ఉండగా మరో దిగ్గజం, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చైర్మన్ క్లైవ్ లాయిడ్ భిన్నంగా స్పందించాడు. వెస్టిండీస్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా యువకులకు చాన్స్ ఇచ్చే క్రమంలోనే చందరపాల్ కు చోటు దక్కలేదన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో ఈ వ్యవహారం పెద్ద రచ్చగా మారింది.