టెన్షన్ పెట్టించి గెలిచారు

July 11, 2015 | 11:32 AM | 3 Views
ప్రింట్ కామెంట్
zimbabwe_india_2015_first_ODI_niharonline

భారత యువటీంకు జింబాబ్వే గడ్డపై తొలిరోజే  విషమ పరీక్ష ఎదురైంది..! అంబటి రాయుడు వీరోచిత శతకానికి తోడు స్టువర్ట్‌ బిన్నీ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం తోడవడంతో మొదటి వన్డేలో భారత్‌ నాలుగు పరుగుల తేడాతో కష్టంగా గెలిచింది...! అజేయ సెంచరీతో చెలరేగి మ్యాచ్‌ను ఆఖరి బంతి దాకా తీసుకెళ్లిన ఆతిథ్య జట్టు కెప్టెన్‌ చిగుంబుర మన కుర్రాళ్ల గుండెల్లో దడపుట్టించాడు..! చివరి ఓవర్లో పది పరుగులు అవసరమవగా.. క్రీజులో చిగుంబుర ఉండడంతో భారత ఆటగాళ్లు.. ఫ్యాన్స్‌ హార్ట్‌బీట్‌ అమాంతం పెరిగింది..! ఆ ఓవర్లో భువనేశ్వర్‌ ఐదు పరుగులే ఇవ్వడంతో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టుగా భారత్‌ గట్టెక్కింది..!  ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్‌ ఓటమిని మూట గట్టుకున్న టీమిండియా.. మరో పరాజయాన్ని తప్పించుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై భారత్‌ నాలుగు పరుగులతో అతికష్టం మీద విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 255 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అంబటి రాయుడు (133 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 124 నాటౌట్‌) అజేయ శతకంతో అదరగొట్టాడు. స్టువర్ట్‌ బిన్నీ (76 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ రహానె (34) ఫర్వాలేదనిపించాడు. ఇక ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన జింబాబ్వే ఏడు వికెట్లకు 251 రన్స్‌ చేసి ఓడిపోయింది. కెప్టెన్‌ చిగుంబుర (101 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 104 నాటౌట్‌) అజేయ శతకం వృథా అయింది. సికందర్‌ రజా (37), మసకద్జ (34) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్‌, బిన్నీ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది. ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ