ఆస్టేలియన్ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్... హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ దురదృష్టం కొద్దీ తలకు బంతి బలంగా తగలడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఘటన మరోకటి రిపీట్ అయ్యింది. శ్రీలంక టెస్టు క్రికెట్ జట్టులో ఓపెనర్ గా రాణిస్తున్న కౌశల్ సిల్వ, ఓ దేశవాళీ మ్యాచ్ ఆడుతూ, బాల్ తగిలి కుప్పకూలాడు. షార్ట్ లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన బాల్ అతన్ని తాకింది. వైస్ కెప్టెన్ దినేష్ చండీమల్ వెంటనే స్పందించి కౌశల్ తల వెనక వైపునకు పరుగెత్తి, బంతి తగలకుండా ఉండేందుకు యత్నించాడు. అయితే అప్పటికే బాల్ అతడి తలను తాకింది. దీంతో వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, మెరుగైన చికిత్స కోసం కొలంబోకు తరలించినట్టు జట్టు మేనేజర్ సేనానాయకే తెలిపారు.
బాల్ తగిలే సమయంలో సిల్వ తలకు హెల్మెట్ ఉందని, దీనివల్ల ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. కాగా, లంక తరఫున 24 టెస్టు మ్యాచ్ లు ఆడిన సిల్వ, 31 సరాసరితో 1,404 పరులుగు చేశాడు. మే నెలలో ఇంగ్లండ్ పర్యటన చేయాల్సిన నేపథ్యంలో, ప్రాక్టీసుగా జరుగుతున్న సన్నాహక మ్యాచ్ లో సిల్వ గాయపడ్డాడు. హ్యూస్ ఉదంతం అనంతరం ఆటగాళ్ల భద్రత కోసం అదనపు ప్యాడింగ్‌తో కూడిన హెల్మెట్లను ఉపయోగిస్తున్నారు. కౌశిల్ సిల్వ కూడా అలాంటి హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది.