తమ సొంత ఆటతోపాటు మరో వ్యాపకంపై కూడా కన్నువేయటం క్రికెటర్లకు కొత్తేమీకాదు. దిగ్గజాలైన సచిన్, గంగూలీ, ధోనీ, బజ్జీలతోపాటు యంగ్ క్రికెటర్లు కొందరు ఇలా ప్రతి ఒక్కరు క్రికెట్ తోపాటు మరో రంగంలో పెట్టుబడులు పెట్టి లాభల పంటను అనుభవిస్తున్నారు. రెస్టారెంట్ లు, ఫ్రాంచైజీలు ఇలా ఏదో ఒకదాంట్లో డబ్బులను బాగానే ఆర్జిస్తున్నారు. తాజాగా టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్ను కూడా ఓదానిపై మళ్లింది.
ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ లో అడుగుపెట్టేందుకు కోహ్లీ పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే తను ఇండియన్ సూపర్ లీగ్ లో ఎఫ్ సీ గోవా జట్టుకు సహ యజమానిగా కొనసాగుతుండగా, తాజాగా యూఏఈ రాయల్స్ లో వాటా తీసుకున్నాడు. టెన్నిస్ ను బాగా నిశితంగా పరిశీలిస్తాను. ప్రొఫెషనల్ టెన్నిస్ లీగ్ లో భాగస్వామిని కావటం నిజంగా సంతోషంగా ఉంది. ఫెదరర్ తోపాటు మా జట్టులో చాలా మంది ఆటగాళ్లున్నారు. ఈ ఫార్మట్ చాలా బాగుండటంతో ఎక్కువ మందిని ఆకర్షిస్తుందని భావిస్తున్నా అని కోహ్లీ మీడియాతో ముచ్చటించాడు. ఈ దఫా టోర్నీ డిసెంబర్ 2న జపాన్ లో జరగనుంది. అన్నట్లు కోహ్లీ రోజర్ ఫెదరర్ కి వీరాభిమాని.