ధోనీ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టాడు

February 29, 2016 | 02:53 PM | 3 Views
ప్రింట్ కామెంట్
dhoni-pak-fan-after-pak-asia-cup-match-niharonline

ఆయన ఓ క్రికెట్ లవర్. క్రికెట్ అంటే అలాంటి ఇలాంటి ఆరాధన కాదు. వయసు ఆరు పదుల పై మాటే. సుదీర్ఘ ప్రయాణాలకు మీ ఆరోగ్యం సహకరించదని డాక్టర్లు హెచ్చరించారు. అయితేనేం తన అభిమాన క్రికెటర్ ధోనీ ఆటను చూడకుండా ఉండలేకపోయాడు. మొన్నటి ‘దాయాదుల’ పోరును కళ్లారా వీక్షించేందుకు ఏకంగా అమెరికా నుంచి బంగ్లాదేశ్ కు వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చాడు షికాగోలో స్థిరపడ్డ మొహమ్మద్ బషీర్.

బషీర్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. ఇంతకు ముందు ఓ మ్యాచ్ సందర్భంగా ధోనీని కలిసి ఫోటో కూడా దిగాడంట. ఇక తన సొంత దేశం పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో ధోనీ ఆటను ఆయన చూడకుండా ఉండలేడు. అందులో భాగంగా ఆసియా కప్ భారత్, పాక్ మ్యాచ్ కు బషీర్ హాజరయ్యాడు. స్టాండ్స్ లో కూర్చుని ఇరు జట్ల ఆటగాళ్లకు మద్దతు పలుకుతూ కేరింతలు కొట్టాడు. పాక్ కు చెందిన అభిమాని అని ఏమో ప్రాక్టీస్ సెషన్స్ లో ధోనీ అతన్ని గుర్తు పట్టి మరీ చేయి ఊపి బషీర్ లో ఉత్సాహం నింపాడట.

మ్యాచ్ అనంతరం బషీర్ మాట్లాడుతూ... ‘‘వారం క్రితం స్వల్పంగా మరోసారి గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లు ప్రయాణం చేయవద్దని వారించారు. కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ లో ధోనీ ఆటను చూడకుండా ఆగలేకపోయాను. వెంటనే విమానం ఎక్కి ఇక్కడ వాలాను’’ అని చెప్పుకొచ్చాడు.

మొన్నటికి మొన్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అభిమానినంటూ, అత్యుత్సాహంతో తన ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేసిన పాకిస్థానీ యువకుడు జైలుకెళ్లి, ఇప్పుడే బెయిలు పొందాడు. ఇంతలో తాను ధోనీ వీరాభిమానినని, ఆయన ఆటను చూసేందుకు తన గుండె కొట్టుకుంటోందంటూ మరో పాకిస్థానీ ప్రకటించటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ