భారత్-పాక్ సిరీస్ కు వేదిక దొరికిందా?

November 23, 2015 | 02:08 PM | 2 Views
ప్రింట్ కామెంట్
india-pakistan-series-venue-srilanka-niharonline

దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి 8 ఏళ్లు దాటింది. చివరగా 2007లో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరిగింది. ఆ తర్వాత ముంబై దాడులు, పాక్ ఉగ్ర కవ్వింపు చర్యలు తదితర కారణాల వల్ల ఇరు దేశాల మధ్య సిరీస్ జరగలేదు. అయితే గతేడాది ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి సిరీస్ కు సంబంధించి తొలి అడుగు పడింది. అయితే వేదికపైనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు విరుద్ధ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. యూఏఈ వేదికగా సిరీస్ నిర్వహిద్దామన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వాదనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తోసిపుచ్చింది. అయితే భారత్ లో సిరీస్ ఆడేందుకు పీసీబీ ఒప్పకోలేదు.

                                               ఈ క్రమంలో నిన్న దుబాయిలో బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్, పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ లు భేటీ అయ్యారు. ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు విశ్వవ్యాప్త క్రికెట్ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ సిరీస్ నిర్వహణకు సంబంధించి వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. వేదికలకు సంబంధించి ఒకరి ప్రతిపాదనను మరొకరు తిరస్కరించిన నేపథ్యంలో ఇరు దేశాలకు సమీపంలోని శ్రీలంకను వేదికగా చేసుకునే అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. శశాంక్, షహర్యార్ ల చర్చల్లో పాలుపంచుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధ్యక్షుడు గైల్స్ క్లార్క్ మరికాసేపట్లో ఈ విషయంపై ఓ ప్రకటన చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దాడులు జరగవచ్చన్న భయంతో శ్రీలంక బోర్డు అందుకు అనుమతి ఇచ్చేది అనుమానమే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందనేది మరి కాసేపట్లో సస్పెన్స్ వీడనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ