ఘోర పరాభవం, సిరీస్ బంగ్లా కైవసం

June 22, 2015 | 10:39 AM | 3 Views
ప్రింట్ కామెంట్
India_lost_series_against_bangladesh_niharonline

ఒక్క వన్డేలోనే కదా ఓడింది ఫర్లేదు లే ఇంకా రెండు ఉన్నాయి అన్నారు కొందరు. మా టీం అంతా స్ట్రాంగ్ ఇంకోటి లేదు అని స్టేట్ మెంట్లు ఇచ్చారు మరి కొందరు ప్లేయర్లు. అయితే ధోనీసేన కు మరో చావుదెబ్బ తప్పలేదు. పసికూనగా భావించి ఓసారి దెబ్బ తిన్నాక కూడా జాగ్రత్త పడలేదు. ఫలితం బంగ్లా బౌలర్ల దెబ్బకు విలవిల లాడారు. పట్టుమని 200 పరుగులు కూడా దాటలేకపోయారు. పైగా ఆ స్పల్ఫ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు పోరాడినట్లు కూడా ఎక్కడా అ(క)నిపించలేదు. మిర్పూర్ రెండో వన్డేలో భారత్ దారుణ ఓటమికి సిగ్గుచేటు కన్నా తక్కువ పదాలు లేవని అనుకోవచ్చునేమో.  20 ఏళ్ల యువ పేసర్‌ ముస్తాఫిజుర్‌ నిప్పులు చెరిగితే మన బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోయారు. టీమిండియా బౌలర్లు బేల చూపులు చూసిన వేళ, బంగ్లా ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాట్‌ తో రెచ్చిపోయారు. చివరకు 2-0 తేడాతో బంగ్లా సిరీస్‌ను వశం చేసుకోవటమే కాదు ర్యాకింగ్ లో 7వ స్థానాన్ని కైవసం చేసుకుని 2017 చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించింది..! టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన 45 ఓవర్లలో 200 పరుగులకే చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో భారత్ నడ్డివిరిచిన కొత్త కుర్రాడు ముస్తాఫిజుర్‌ మరోసారి ఆ పనినే కానిచాడు. భారత్ తరపున శిఖర్‌ ధవన్‌ (53) అర్ధశతకంతో రాణించగా, కెప్టెన్‌ ధోనీ (47), రైనా (34), కోహ్లీ (23) ఫర్వాలేదనిపించారు. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్ ప్రకారం బంగ్లా లక్ష్యాన్ని 47 ఓవర్లలో 200 పరుగులుగా నిర్దేశించగా, లిట్టన్‌ దాస్‌ (36), సౌమ్య సర్కార్‌ (34), ముష్ఫికర్‌ (31) రాణించటంతో 38 ఓవర్లకే విజయ తీరాన్ని చేరింది. అదే విధంగా భారత్‌పై తొలిసారి వన్డే సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. ముస్తాఫిజుర్‌ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ