పొట్టి ఫార్మట్ ఫైనల్ కి వేదిక దొరికిందోచ్...

July 22, 2015 | 05:26 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Eden_Gardens_2016_t20_worldcup_final_niharonline

ప్రఖ్యాత కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం చాలా కాలం తర్వాత ప్రముఖ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఐసీసీ వరల్డ్‌ టీ-20 ఫైనల్‌కు ఈడెన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దేశంలోని ఎనిమిది ప్రముఖ నగరాల్లో వరల్డ్‌కప్‌ను నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. బెంగళూరు, చెన్నై, ధర్మశాల, మొహాలీ, ముంబై, నాగపూర్‌, న్యూఢిల్లీ, కోల్‌కతాలు మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం ఒక సెమీఫైనల్‌ మ్యాచ్‌కు, ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా మైదానం రెండో సెమీస్‌కు వేదికయ్యే అవకాశం ఉంది. ‘ఒక సెమీఫైనల్‌ ముంబైలో జరగనుంది. రెండోది ఢిల్లీలో జరిగే చాన్సుంది. ఒక వేళ ఢిల్లీలో సెమీస్‌ మ్యాచ్‌ లేకపోతే.. భారత్‌-పాకిస్థాన్‌ లాంటి హైవోల్టేజ్‌ మ్యాచ్‌ నిర్వహిస్తాం. ధర్మశాలలో టీమిండియా ఆడే ఒక మ్యాచ్‌ను కేటాయిస్తామ’ని బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పాడు. ‘ప్రఖ్యాత టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం బీసీసీఐకు గర్వకారణం. ఎంపిక చేసిన వేదికలు గతంలో అత్యుత్తమ మ్యాచ్‌లు నిర్వహించాయి. వేదికలను ప్రకటించడంవల్ల ముందుగానే సన్నాహాలు ఆరంభించవచ్చు. ఈ వరల్డ్‌కప్‌ ఆటగాళ్లకు, అభిమానులకు చిరకాలం గుర్తుండి పోతుంద’ని ఠాకూర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరమ్మతు పనులు పూర్తికాని కారణంగా 2008లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిథ్యం ఇవ్వలేక పోయింది. ఇక్కడ కేటాయించిన భారత్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి మార్చారు. గత చరిత్రను పరిశీలిస్తే...చిరకాలం గుర్తుండి పొయే ఎన్నో మ్యాచ్‌లకు ఈడెన్‌ వేదికైంది. 1987లో రిలయన్స్‌ కప్‌ ఫైనల్‌, 1996లో వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహించారు. ‘ఎంపిక చేసిన వేదికలు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకుగాను ఐసీసీ, బీసీసీఐ సూచించిన ప్రమాణాలను కచ్చితంగా అందుకోవాల’ని బోర్డు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 2007లో ఆరంభమైన టోర్నీకి దక్షిణాఫ్రికా మొదటి ఆతిథ్యం ఇచ్చింది. తొలి కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ