ధోనీ ఆడాడు... క్లీన్ స్వీప్ తప్పింది

June 25, 2015 | 02:37 PM | 3 Views
ప్రింట్ కామెంట్
dhoni_india_bangladesh_series_niharonline

సిరీస్‌ను కోల్పోయి తీవ్రంగా అవమానం పాలైన టీమిండియా మూడో వన్డే ఊరట నిచ్చింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తోపాటు చాలా కాలం నుంచి ఫామ్ లో లేని కెప్టెన్ ధోనీ రాణించటంతో బంగ్లా క్లీన్‌స్వీప్‌ ఆశలపై ధోనీసేన నీళ్లు జల్లింది. బుధవారమిక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్‌ 77 పరుగులతో బంగ్లాను చిత్తుచేసింది. టీమిండియా నిర్దేశించిన 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 47 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా ఆరంభంలోనే తడబడింది. షబ్బీర్‌ రహ్మాన్‌ (43), సౌమ్య సర్కార్‌ (40), లిట్టన్‌ దాస్‌ (34) నాసిర్‌ హుస్సేన్‌ (32) రాణించినా విజయం దక్కలేదు. భారత బౌలర్లలో రైనా మూడు, అశ్విన్‌, ధవళ్‌ కులకర్ణి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 317 పరుగులు సాధించింది. డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (73 బంతుల్లో 10 ఫోర్లతో 75), కెప్టెన్‌ ధోనీ (77 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 69) అర్ధ శతకాలతో అదరగొట్టారు. అంబటి రాయుడు (44), సురేష్‌ రైనా (21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. బంగ్లా బౌలర్లలో మష్రఫె మోర్తజా మూడు, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. రైనా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా, సిరీస్‌లో 13 వికెట్లు పడగొట్టిన ముస్తాఫిజుర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కింది. ఇక ఈ సిరీస్ లో బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ సంచలనం ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ మరో వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో తొలి రెండు వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టిన ఈ లెఫ్టామ్‌ పేసర్‌ మూడో వన్డేలోనూ రెండు వికెట్లు దక్కించుకుని సిరీస్‌లో తన వికెట్ల సంఖ్యను 13కి పెంచుకున్నాడు. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో అత్యధికంగా 13 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ