టీంలపై రెండేళ్లు, వాటి ఓనర్లపై జీవితకాలం...!

July 15, 2015 | 10:45 AM | 8 Views
ప్రింట్ కామెంట్
ipl_CSK_RR_banned_2_years_Owners_lifetime_niharonline

కోట్లు కురిపించే కల్పవృక్షం అయినా కక్కుర్తిపడ్డారు.  బెట్టింగ్‌లకు పాల్పడి కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. చివరికి వారి చెంప ఛెళ్లుమనిపించేలా జస్టిస్‌ లోథా కమిటీ గట్టిగా బుద్దిచెప్పింది..! బీసీసీఐ పెద్దల అండతో.. ఫ్రాంచైజీల యజమానులం కాబట్టి తమను ఏమీ చేయలేరన్న గర్వంతో విర్రవీగిన మేయప్పన్‌, రాజ్‌ కుంద్రాలకు దిమ్మదిరిగే షాకిచ్చింది..! జీవితకాలం వేటు వేసి వారి లైఫ్‌లో ఇక క్రికెట్‌ అనే పదానికి చోటే లేకుండా చేసింది..! యజమానులే తప్పుచేశారని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరించినందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలకు కూడా తగిన శిక్ష విధించింది..! రెండేళ్లపాటు ఐపీఎల్‌లో పాల్గొనకుండా సస్పెండ్‌ చేసింది..! మొత్తానికి ఐపీఎల్‌ ద్వారా వచ్చి పడుతున్న వేల కోట్లతో క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న బీసీసీఐకి బుద్దొచ్చే తీర్పునిచ్చింది.! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో రెండుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, తొలి అంచె విజేత రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ జస్టిస్‌ రాజేంద్ర మల్‌ లోథా కమిటీ సంచలన తీర్పునిచ్చింది. ఐపీఎల్‌ నిబంధనలను తుంగలో తొక్కి 2013లో యథేచ్ఛగా బెట్టింగ్‌లకు పాల్పడిన ఈ రెండు జట్ల అధికారులపై సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్‌ లోథా కమిటీ కొరడా ఝుళిపించింది. ఆయా జట్ల అధికారులు గురునాథ్‌ మేయప్పన్‌, రాజ్‌ కుంద్రాలపై జీవితకాల నిషేధం విధించింది. ఐపీఎల్‌-6 సందర్భంగా వెలుగు చూసిన బెట్టింగ్‌ కుంభకోణంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్‌ ఆర్‌ఎం లోథా, అశోకర్‌ భాన్‌, ఆర్‌ రవీంద్రన్‌తో కూడిన త్రిసభ్య కమిటీ మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువరించిన రోజు నుంచే మేయప్పన్‌, రాజ్‌ కుంద్రాలపై నిషేధం అమల్లోకి వస్తుందని లోథా చెప్పారు. ఇక ఈ తీర్పుతో వచ్చే రెండు సీజన్లలో (2016, 17) చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఐపీఎల్‌ కు దూరంకానున్నాయి. కాగా, కాసులు కురిపించే టీ20 లీగ్‌లో రెండేళ్లపాటు స్టార్‌ ఆటగాళ్లతో నిండిన చెన్నై, రాజస్థాన్‌ లేకపోవడం ఐపీఎల్‌పై తీవ్ర ప్రభావమే చూపనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ