ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 152 పరుగులు సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ 44 బంతుల్లో 57 పరుగులతో రాణించాడు. అయితే మిగతా వారెవ్వరు రాణించలేకపోయారు. సీనియర్ బౌలర్ హర్భజన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబైని ఆరంభంలోనే జహీర్ ఖాన్ దెబ్బ తీశాడు. త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోవటంతో ముంబై గెలుపుపై కాస్త టెన్షన్ నెలకొంది. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ, మరో బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు సహకారంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ముంబై ఖాతాలో జమచేశారు. రాయుడు కేవలం 40 బంతుల్లో 49 పరుగులు సాధించటం విశేషం. చివర్లో పోలార్డ్ మూడు సిక్స్ లు బాదటంతో వాంఖడేలో ముంబై గెలుపు లాంఛనంగా మారింది.