ఇక ఇంగ్లాండ్ ఇంటికే... ఉత్కంఠ పోరులో బంగ్లా చేతిలో ఓటమి

March 09, 2015 | 05:49 PM | 51 Views
ప్రింట్ కామెంట్
Bangladesh_won_on_england_niharonline

ఇంగ్లండ్ కలల మేడలు కుప్పకూలాయి. ఇప్పటి దాకా ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవని ఇంగ్లండ్ కు ఈసారైనా ముచ్చట తీర్చుకోవాలన్నప్పటికీ ఆశలు ఆవిరయ్యాయి. తాజా కప్ లో చెత్తగా ఆడిన ఇంగ్లీష్ మెన్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. బంగ్లాదేశ్ తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లండ్ చతికిలపడింది. హోరాహోరీగా సాగిన పోరులో బంగ్లా 15 పరుగులతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. దీంతో ఇంగ్లండ్ ఇంటిదారి పట్టగా, బంగ్లాదేశ్ క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. ఐదు మ్యాచ్ లాడిన ఇంగ్లండ్ (2) ఓ మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. బంగ్లా 7 పాయింట్లతో (3 విజయాలు, వర్షంతో ఓ మ్యాచ్ రద్దు) గ్రూపు-ఎలో మూడో స్థానంలో నిలిచింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ బెల్ (63) హాఫ్ సెంచరీ చేశాడు. కాగా ఇతర టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. చివర్లో బట్లర్ (65), వోక్స్ (42 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లు రూబెల్ హొసేన్ కు నాలుగు, మోర్తజా, టస్కిన్ కు చెరో రెండు వికెట్లు పడ్డాయి. సెంచరీ హీరో మహ్మదుల్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. మహ్మదుల్లా సెంచరీ, ముష్ఫికర్ అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది. మహ్మదుల్లా 138 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. వేగంగా ఆడిన ముష్ఫికర్ 76 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో 89 పరుగులు సాధించాడు. సౌమ్య సర్కార్ 40, సబీర్ 14 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, జోర్డాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ