అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ ముందుందని నిరూపించుకుంది. సౌతాఫ్రికా తన సెమీస్ ఫీవర్ ను మరోసారి కొనసాగించి ఇంటి బాట పట్టింది. మంగళవారం చివరి బంతి వరకు హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ బెర్తు సొంతం చేసుకుంది. ఇలియట్ (84 నాటౌట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్) వీరోచిత పోరాటం తో విజయాన్ని కైవసం చేసుకుంది. సెమీస్ మ్యాచ్‑కు వర్షం అంతరాయం కలిగించడంతో 43 ఓవర్లకు కుదించారు. డక్‑వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 298 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ 6 వికెట్లు కోల్పోయి చివరి బంతి మిగిలుండగా విజయం సాధించింది. ఓపెనర్లు గుప్తిల్, బ్రెండన్ మెకల్లమ్ శుభారంభం అందించారు. వీరిద్దరూ 36 బంతుల్లో 71 పరుగులు చేశారు. బ్రెండన్ (26 బంతుల్లో 59) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కాగా కివీస్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న దశలో సౌతాఫ్రికా పేసర్ మోర్కెల్ బ్రేక్ వేశాడు. మోర్కెల్ వరుస ఓవర్లలో మెకల్లమ్, విలియమ్సన్‑ను అవుట్ చేశాడు. అయినా గుప్తిల్, రాస్ టేలర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా కీలక సమయంలో పెవిలియన్ చేరారు. ఇలియట్ (84 నాటౌట్) వీరోచిత పోరాటంతో పాటు ఆండర్సన్ (58) రాణించి కివీస్‑ను గెలిపించారు. స్టెయిన్ వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతికి ఇలియట్ సిక్సర్ సంధించడంతో కివీస్ విజయం ఖాయమైంది. ఈ నెల 29న జరిగే గ్రాండ్ ఫైనల్లో కివీస్.. భారత్, ఆస్ట్రేలియాల రెండో సెమీస్ విజేతతో తలపడనుంది. గతంలో ఆరుసార్లు సెమీస్ లో బోల్తాపడిన కివీస్ ఈ సారి మాత్రం సౌతాఫ్రికా జట్టు రూపంలో ఉన్న గండాన్ని అధిగమించింది. ఉపఖండంలో జరిగిన గత వరల్డ్ కప్ లో భారత్ ఏ విధంగా అయితే పూర్తి ఆధిక్యం కనబరిచి కప్ ను కైవసం చేసుకుందో... ఈసారి న్యూజిలాండ్ కు ఆ ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగా ఫైనల్ లో అద్భుతం చేసి కప్ గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ టూ బ్లాక్ క్యాప్స్.