వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో పెనుసంచలనం నమోదైంది. క్రికెట్ లో పసికూన జట్టుగా భావించిన ఐర్లాండ్ విండీస్ పై విజయం సాధించింది. భారీ టార్గెట్ 305 పరుగుల లక్ష్యచేధన ను ఐర్లాండ్ మరో నాలుగు ఓవర్లు ఉండగానే అలవోకగా సాధించి (307/6) ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు సాధించింది. ఇక 305 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆటగాళ్లు మొదటినుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఓపెనర్ స్టిర్లింగ్ 92, జాయ్ సీ 84, ఓ బ్రియాన్ 79 పరుగులు సాధించి సింపుల్ గా లక్ష్యాన్ని చేధించారు. ఆఖర్లో తడబడి వికెట్లు కోల్పోతున్నప్పటికీ కీలక ఆటగాడు ఓ బ్రియాన్ ఒంటరిగా పోరాడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, గతంలో ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఐర్లాండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్టులను ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు వెస్టిండీస్ ను కూడా తేలికగా ఓడించి తన ఖాతాలో మరో టీంను చేర్చుకుంది. ఇక భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఐర్లాండ్ జట్టు ఓ ఛాంపియన్ జట్టులా ఆడిందని కితాబిచ్చాడు.