ప్రపంచ కప్ లో భారత జట్టు శుభారంభం దాయాది పాకిస్థాన్ పైనే కావటం విశేషం. భారీ టార్గెట్ ను పాక్ ముందుంచటంలో కీలక పాత్ర పోషించాడు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతేకాదు అజేయంగా 126 బంతుల్లో 107 పరుగులు సాధించి ఇంత వరకు ప్రపంచకప్ లో పాక్ పై ఏ ఆటగాడు సాధించని ఫీట్ ను కోహ్లీ సాధించాడు. ఇప్పటిదాకా ఉన్న సచిన్ (98) హయ్యెస్ట్ స్కోర్ తప్ప మరే ఇతర ఆటగాడు పాకిస్థాన్ పై సెంచరీ చేయలేదు. దీనిని కోహ్లీ సాధించి మ్యాచ్ విజయాన్ని జట్టుకు అందించి 125 కోట్ల భారతీయుల మన్ననలను పొందాడు. అయితే ఇక్కడ మ్యాచ్ విన్నర్ కోహ్లీ కాదని ఆ క్రెడిట్ అంతా రైనాకు కట్టబెడుతున్నాడు కెప్టెన్ ధోనీయే. ఈ మ్యాచ్ కు అసలు హీరో చిచ్చర పిడుగు సురేష్ రైనా అని అంటున్నాడు. ఈ విజయంలో రైనా కీలకపాత్ర పోషించాడని ధోనీ ఆట తర్వాత జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. ఇందుకు కారణాలు లేకపోవు. కోహ్లీ కి 3, 76 వ్యక్తిగత పరుగుల వద్ద లైఫ్ రావటం, సెంచరీ చేయటం కోసం 117 బంతులు తీసుకోవటం ఇక్కడ చెప్పుకోదగ్గవి. కానీ, రైనా మాత్రం ఆది నుంచే దూకుడుగా ఆడుతూ కేవలం 40 బంతుల్లోనే అర్థ శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ‘‘రైనా ఓ కీలక ఆటగాడు. ఏ ప్లేస్ లో బ్యాటింగ్ దిగడానికి అయిన ఇబ్బంది పడడు. ధావన్-కోహ్లీ లు మంచి భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ ఆ తర్వాత వచ్చి పాక్ పై విరుచుకుపడి స్కోరును ఉరకలెత్తించాడు. ఈ మ్యాచ్ విజయంలో రైనా కీలక పాత్రధారి’’ అంటూ రైనా పై ధోనీ ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి రహానే ను కాదని ఆ ప్లేస్ లో రైనా ను పంపిన ధోనీ వ్యూహం మొత్తానికి ఈ రకంగా ఫలించిందన్నమాట.