ప్రపంచకప్ లో తొలిబంతే పడలేదు. అప్పుడే వివాదాలు ప్రారంభమయ్యాయి. అదేలా అంటారా... పాక్ జట్టు పై ఐసీసీ జరిమానా విధించిందిలేండి. మైదానంలోనే కాదు బయట కూడా పాక్ ఆటగాళ్ల ప్రవర్తన తీరుపై తరుచు విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ తరహాలోనే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం బయటకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాళ్లపై ఫైన్ విధించింది. ఆఫ్రిదీ తో సహా మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు డిన్నర్ కోసం బయటకు వెళ్లి నిర్ణీత సమయానికి రాలేదు. దీంతో ఒక్కోప్లేయర్ పై 230 డాలర్ల జరిమానా విధించింది ఐసీసీ. అయితే బయటకు వెళ్లిన వాళ్లలో పాక్ ప్లేయర్ షహజాద్ మరో అడుగు ముందుకేసి ఓ బాక్సర్‌తో గొడవ పడ్డాడట. దీనిపై జట్టు మేనేజర్ నవీద్ చీమా పాక్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఐసీసీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అనంతరం ఆటగాళ్లు క్షమాపణ చెప్పటంతో ఫైన్ తో సరిపెట్టింది. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే, తక్షణమే టోర్నమెంట్ నుంచి బహిష్కరిస్తామని జట్టు మేనేజ్‌మెంట్ ను ఐసీసీ హెచ్చరించింది.