కుమార సంగక్కర... శ్రీలంక ఎడమచేతి స్టార్ బ్యాట్స్ మెన్ ఆపద సమయాల్లో జట్టును ఆదుకుని విజయాలను అందించటంలో కీలక వ్యక్తి. బ్యాటింగ్ స్టైల్లోనే కాదు రికార్డులు క్రియేట్ చేయటంలో కూడా తనకు తానే సాటి. ఇక తాజాగా మంగళవారం చిన్న జట్టు స్కాట్ లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. తద్వారా వరుసగా నాలుగు మ్యాచ్ లలో నాలుగు వరుస సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు కెక్కాడు. వరుస మూడు సెంచరీలు సాధించిన వారు ఉన్నారు గానీ, నాలుగు సెంచరీలు చేసినవారు లేరనే చెప్పాలి. క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా, ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన ఆటగాళ్లుగా పేరొందిన బ్రాడ్ మెన్, సచిన్, లారా లాంటి వారికి సైతం సాధ్యం కానీ ఈ ఫీట్ ను సంగక్కర అలవోకగా సాధించేశాడు. పోనీ ఈ సెంచరీ చిన్నజట్టు మీద సాధించాడు అనుకున్నప్పటికీ మిగతా మూడు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టాప్ జట్లపైనే సాధించాడు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన రాస్ టేలర్, సౌతాఫ్రికా కు చెందిన హర్షెల్ గిబ్స్, డీకాక్, డివిలియర్స్, పాకిస్థాన్ కు చెందిన జహీర్ అబ్బాస్,సయిద్ అన్వర్ లు వరుసగా మూడు సెంచరీలు సాధించినవారిలో ఉన్నారు. మొత్తం 403 వన్డేలాడిన సంగక్కరకి ఇది 25వ సెంచరీ. సంగక్కర ఎప్పటికీ సమ్ థింగ్ స్పెషలే అని ఈ రికార్డుతో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.