ఎలా ఆడితే రికార్డుల మోత మోగుద్దో దక్షిణాఫ్రికా జట్టుకు తెలిసినంత బాగా మరేయితర జట్టుకు బహుశా తెలీదేమో. తాజాగా మంగళవారం ఐర్లాండ్ పై రికార్డుల మోత మోగించి సౌతాఫ్రికా రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. గత వారం వెస్టిండీస్ పై తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఈ మ్యాచ్ తో తానే చెరిపేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 411 పరుగులు సాధించింది. 2 పరుగులకే తొలి వికెట్ నష్టపోయిన సఫారీ టీమ్ ను ఆమ్లా, డుప్లెసిస్ శతకాలతో భారీ స్కోరు బాట పట్టించారు. డుప్లెసిస్ 109 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 109 పరుగులు చేశాడు. ఆమ్లా 128 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. చివర్లో రోసో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశారు. మిల్లర్(46, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి తోడుగా నిలిచాడు. హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్ 2వ వికెట్ గానూ 247 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని వీరిద్దరు నెలకొల్పారు. ఇక భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ దక్షిణాఫ్రికా ముందు నిలవలేకపోయింది. అయితే చివరికి మాత్రం 210 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ సాధించినప్పటికీ 201 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు అబాట్, స్టెయిన్ ఐర్లాండ్ ను చావుదెబ్బ తీశారు. అబాట్ 4, స్టెయిన్ 2 వికెట్లు తీశారు. ఐర్లాండ్ ఆరంభంలోనే 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో దాపుగా ఓటమి ఖాయమైంది. బాల్బిర్నె(58), కెవిన్ ఒబ్రెయిన్ (48) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్ ఓటమి కాస్త ఆలస్యమైంది. విండీస్ తో పోలిస్తే ఐర్లాండే కాస్త గట్టిపోటీనిచ్చింది. 48/5తో పీకల్లోతు కష్టాల్లోపడ్డ ఐర్లాండ్ భీకరమైన సఫారీ బౌలర్లను ఎదుర్కొని నుంచి 200 పరుగుల మార్క్ దాటించడం విశేషం. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.