వరల్డ్ కప్ లో భాగంగా పెద్ద టీంలే కాదు కృత్రిమ పిచ్ ల పుణ్యమాని చిన్న జట్టులు కూడా భారీ స్కోర్ లే సాధిస్తున్నాయి. లీగ్ మ్యాచ్ లో భాగంగా పసికూన స్కాట్ లాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని చేధించి బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్ లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లుకోల్పోయి 318 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ కైలీ కోయెట్జర్ బంగ్లా బౌలర్లను బంతాట ఆడుకున్నాడు. 134 బంతులాడి 17 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 156 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఆ విజయలక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. సౌమ్య సర్కార్(2) మినహా మిగతా అందరూ తమ బ్యాట్ లను ఝుళిపించారు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 95 బంతుల్లో 95 పరుగులతో రాణించగా, మరో ముగ్గురు బ్యాట్స్ మెన్లు అర్థ సెంచరీలు సాధించారు. దీంతో నాలుగు వికెట్లను కోల్పోయిన బంగ్లా అవలీలగా విజయలక్ష్యాన్ని సాధించింది. ఇక ఈ విజయంతో ఇంగ్లాండ్ అవకాశాలకు కు బంగ్లా ఎర్త్ పెట్టినట్లయ్యింది. రెండు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో ఫ్లేసుకు చేరుకుని ఇంగ్లాండ్ కు గట్టి పోటీనిస్తోంది.