గేల్ విధ్వంసకాండ ముందు మోకరిల్లిన జింబాబ్వే

February 24, 2015 | 05:50 PM | 29 Views
ప్రింట్ కామెంట్
Gayle_westindies_zimbabwe_wc_niharonline

ఆటలోని మజా ఏంటో తన బ్యాటింగ్ తో మరోసారి రుచిచూపించాడు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్. కనికరం చూపకుండా జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితం వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి దాకా నమోదుకానీ డబుల్ సెంచరీ ఫీట్ అతని కాళ్ల దగ్గరకు వచ్చి చేరింది. గేల్ అనే సునామీ ఎలా ఉంటుందో కాన్ బెర్రా మనుకా ఓవల్ లో కనిపించింది. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు తోడు శామ్యూల్స్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు నమోదైంది. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 215 పరుగులు చేసిన గేల్.. మసకద్జా వేసిన చివరి ఓవర్ ఆఖరు బంతికి చిగుంబరకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 156 బంతులు ఎదుర్కొన్న మార్లన్ శ్యామ్యూల్స్ 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 133 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు బౌలింగ్ తో గేల్ కూడా మ్యాజిక్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ క్రిస్ గేల్ డబుల్ సెంచరీ, శామ్యూల్స్ సెంచరీతో 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 44.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లలో విలియమ్స్ కాసేపు పోరాటం చేసినప్పటికీ జట్టును ఆదుకోలేక పోయాడు. ఈ ఆటగాడు 61 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగుచేసి, ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అవుటయ్యాడు. అలాగే, ఇర్విన్ అర్థసెంచరీ (52) చేయగా, ఓపెనర్ రజా 26, టెయిలర్ 37, కెప్టెన్ చిగుంబుర 21 పరుగులు చేశారు. అయితే, విండీస్ బౌలర్లు హోల్డర్, టెయిలర్ చెరో మూడు వికెట్లు గేల్ 2 వికెట్లు నేలకూల్చాడు. శామ్యూల్స్‌కు ఒక వికెట్ దక్కింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శననిచ్చిన క్రిస్ గేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. భారత్ ఆటగాడు(రోహిత్,సెహ్వగ్, సచిన్) కాకుండా వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డుకెక్కాడు. ఇక అత్యధిక పరుగుల భాగస్వామ్యం పేరిట ఉన్న రికార్డును కూడా గేల్ శామ్యూల్స్ చెరిపేశారు. గతంలో ఈ రికార్డు సచిన్-ద్రావిడ్ (న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ) పేరిట ఉండేది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ