టీమీండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై విమర్శలు రావటాన్ని జట్టు డైరక్టర్ రవిశాస్త్రి భరించలేకపోతున్నట్లుంది. జట్టు ఓటమికి కోహ్లీని బాధ్యుడిని చేయటం సరికాదని ఆయన అంటున్నారు. సెమీస్ లో కోహ్లీ వైఫల్యం చెందటంపై అనుష్క శర్మను బాధ్యురాలే అంటూ సోషల్ మీడియా సైట్లలో వస్తున్న సెటైర్ల గురించి తెలిసిందే. కోహ్లీ మది నిండా అనుష్క ఉండగా ఆట ఎలా ఆడుతాడంటూ ఓరేంజ్ లో పంచ్ లు వేస్తున్నారు. దీనిపై రవిశాస్త్రి కాస్త సీరియస్ గానే స్పందించాడు. కోహ్లీ చిత్తశుద్ధిని శంకించలేమని, అతడి గుండే దేశం కోసమే కొట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆసీస్ పర్యటనలో కోహ్లీ బాగానే ఆడాడని, భారీ సంఖ్యలో పరుగులు చేశాడని కితాబిచ్చారు. అనుష్క శర్మే కోహ్లీ వైఫల్యానికి కారణమనుకుంటే ఆసీస్ గడ్డపై అన్ని పరుగులు చేసేండేవాడే కాడని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత కోహ్లీ ఆటతీరు గణనీయంగా మెరుగైందని తెలిపారు. మరీ అంతటి పోటుగాడు అప్పటిదాకా బాగా ఆడి... కీలకమైన మ్యాచ్ లోనే ఎందుకు రాణించలేకపోయాడు. పైగా ఈ మ్యాచ్ సందర్భంగానే అనుష్క అక్కడికి వెళ్లింది కదా అంటూ అక్కడున్న కొంతమంది పాత్రికేయ సహోదరులు రవి సమక్షంలోనే జోకులేసుకున్నారట.