వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ గురువారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలో శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించారు. ధావన్ (30 )పరుగులు చేసి అవుటైన క్రమంలో రోహిత్ మాత్రం చూడ చక్కనైన షాట్లతో అలరించాడు. తొలి బంతినే బౌండరీకి తరలించిన రోహిత్ శర్మ తన ఉద్దేశిమేమిటో ముందుగానే బౌలర్లకు చెప్పాడు. అతనికి జతగా సురేష్ రైనాకు బాధ్యతాయుతంగా ఆడటంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. ఈ క్రమంలో రైనా(65)పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అనంతరం రోహిత్(137; 126 బంతుల్లో 14 ఫోర్లు,3 సిక్సర్లు)) కీలక ఇన్నింగ్స్ ఆడి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(6) పరుగులు చేసి అభిమానులను నిరాశపరిచగా, చివర్లో రవీంద్ర జడేజా(23 ) పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత ఓవరల్లో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ కు మూడు వికెట్లు లభించగా మోర్తాజా, రూబెల్, షకిబుల్ హసన్ లకు తలో వికెట్ లభించింది.