నెత్తురొడిన మక్కా... భారీ క్రేన్ తో 107 మంది బలి

September 12, 2015 | 11:49 AM | 3 Views
ప్రింట్ కామెంట్
mecca-crain-collapse-107-died-niharonline

పరమ పవిత్రమైన మక్కా మసీదులో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. హజ్‌ యాత్ర సందర్భంగా ఓవైపు ముస్లింలు ప్రార్థన చేస్తుంటే.. ఓ భారీ క్రేన్ కూలిపోవడంతో దాదాపు  107 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు.  పెను గాలులు వీయటంతో నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌ కూలిపోయింది. మసీదు పైభాగాన్ని చీల్చుకుంటూ క్రేన్ నేలకొరిగింది. క్రేన్‌ విరుచుకుపడటంతో మసీదు పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. పరిగెత్తేందుకు కూడా వీలు లేకపోవటంతో దానికింద పడి చాలా మంది నలిగిపోయారు. ప్రార్థన ప్రాంగణమంతా రక్తపు మరకలతో ముద్దగా మారింది.

సెప్టెంబర్ 21 నుంచి తేదీ నుంచి హజ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్‌సహా అనేక దేశాలకు చెందిన వేలాదిమంది ముస్లింలు దీనికోసం సౌదీ చేరుకున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే యాత్రికుల కోసం సౌదీ ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఏకకాలంలో 22 లక్షల మంది ప్రార్థనలు చేసేందుకు వీలుగా మసీదు విస్తీర్ణాన్ని 4 లక్షల చదరపు మీటర్లకు విస్తరిస్తోంది. దీనికోసం కొన్నాళ్లుగా భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో నిర్మాణ క్రేన్లను ఏర్పాటు చేసి పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే సౌదీ చేరుకున్న యాత్రికులు శుక్రవారం ప్రార్థనల కోసం పెద్దసంఖ్యలో మక్కా మసీదుకు చేరుకున్నారు. ఈ సమయంలోనే పెను ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల్లోనూ ఎక్కువ మంది హజ్‌ యాత్రికులేనని తెలుస్తోంది. ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు గాయపడగా, వారిలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు హజ్‌ యాత్రికులు ఉన్నారు. పాతబస్తీ భవానీనగర్‌కు చెందిన షేక్‌ ముజీబ్‌, బజార్‌ఘాట్‌కు చెందిన అనీఫ్‌ దంపతులకు గాయాలయ్యాయని తెలంగాణ హజ్‌ కమిటీ అధికారులు తెలిపారు. క్రేన్‌ భాగాలు పైనుంచి కిందికి వేలాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో షేర్‌ అవుతున్నాయి. సహాయ సిబ్బంది, వైద్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ